భద్రాచలంటౌన్: భద్రాచలం గోదావరి స్నాన ఘట్టాల వద్ద ఆదివారం నదీ హారతి భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ చవితి నేపథ్యంలో నిర్వహించిన పూజలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హారతికి ముందు గణపతి పూజ, దీపోత్సవం చేపట్టి, పూజా ద్రవ్యాలతో గోదావరికి అష్టోత్తర శతనామార్చన చేశారు. ప్రతి ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని నదీమాత ఆశీస్సులు పొందుతున్నారని అర్చకుడు రామావజ్జుల రవికుమార్ తెలిపారు.
సాంస్కృతిక ప్రదర్శనలు
నదీ హారతి ప్రారంభానికి ముందు హైదరాబాద్‌కు చెందిన అనిల్ అకాడమీ ఆర్ట్స్, నిత్య భారతి కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను విశేషంగా అలరించాయి. అనంతరం శాంతి మంత్ర పఠనంతో కార్యక్రమం ముగిసింది. సిరిపురపు అశోక్ కుమార్ శర్మ దంపతులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ వారు పూజా సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఓ వరలక్ష్మి– వెంకటేశ్వర్లు, పురోహితులు సురేష్ శర్మ, అశోక్ కుమార్ శర్మ, వీరభద్ర శర్మ, రామాచార్యులు, ప్రసాద్ శర్మ, ఫణి కుమార్ శర్మ, కృష్ణ శర్మ, తేజ శర్మ తదితరులతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.


