గిరిజన గురుకుల సంస్థ కార్యదర్శి సీతామహాలక్ష్మి
పాల్వంచరూరల్: కిన్నెరసాని, కృష్ణసాగర్, సుదిమళ్ల గురుకులాల్లో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని గిరిజన గురుకుల సంస్థ కార్యదర్శి సీతామహాలక్ష్మి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్ సైట్ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించారు. రూ.25 లక్షలతో మరమ్మతులు నిర్వహిస్తున్న భోజనశాల పనులను, శిథిలావస్థకు చేరిన తరగతి గదులను పరిశీలించారు. మరమ్మతు పనులను జూన్ 10లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో గిరిజన గురుకుల పాఠశాలల మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. అద్దెభవనాల్లో కొనసాగుతున్న పాల్వంచలోని డిగ్రీ కళాశాల, దమ్మపేటలోని పాఠశాలకు సొంత భవనాల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు నటరాజ్, అరుణకుమారి, వెంకట్, మధుకర్, రాజు, శ్రీకాంత్, ప్రిన్సిపాల్ రమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు.


