కోతుల బెడద నుంచి పంటలను కాపాడుకుంటున్న రైతులు
రూ. 10 వేలతో ఎకరం విస్తీర్ణానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు
సులభంగా రక్షణ
సౌర
కంచె..
ఇల్లెందు: కోతులు, అడవి పందుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థ పడుతున్నారు. 24 గంటలపాటు కాపలా కాయాల్సి వస్తోంది. అదే అటవీ సమీపంలోని చేలల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఇల్లెందు ఏరియాలో సుమారు 50 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగులో ఉంది. ఇల్లెందు, బయ్యారం, టేకులపల్లి, కారేపల్లి, గుండాల, ఆళ్లపల్లిలో పోడు భూముల్లో కూడా మొక్కజొన్న సాగు చేపట్టారు. కోతులు, అడవి పందుల బెడదతో పంటలు చేతికి రాకపోవడంతో రైతులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. చేను చుట్టూ సౌర కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎకరం విస్తీర్ణానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ. 10 వేల వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. చుట్టూ ఫెన్సింగ్ కోసం కర్రలు, వైరు, సోలార్ ప్లేట్, బ్యాటరీ, రీచార్జ్ అయ్యే బాక్స్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. సోలార్ విద్యుత్ ఫెన్సింగ్ తీగల ద్వారా ప్రసారం అవుతుండటంతో కోతులు, పశువులు, అడవి పందులు తగిలితే షాక్ కొడుతుంది. కానీ ప్రాణ నష్టం ఉండదు. దీంతో పంట చేలకు కోతులు, పశువులు, పందుల బెడద తప్పింది. ఒక్కో సోలార్ ప్లాంట్ నుంచి సామర్థ్యం ఆధారంగా 50 ఎకరాల వరకు కంచె ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇల్లెందు మండలంలో బొజ్జాయిగూడెం, వేపలగడ్డ, తండా, జగదాంబా గుంపు, మొట్ల గూడెం, తొడిదెలగూడెం, పంతులునాయక్ తండా, టేకులగూడెం, మొండితోగు గ్రామాల్లో రైతులు వందల ఎకరాలకు సోలార్ కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ ఫెన్సింగ్‌తో పంటలను సులభంగా రక్షించుకోగలుగుతున్నామని రైతులు మోతీలాల్ సాహూ, శ్యాంలాల్ సాహూ, బి శ్రీనివాసరావు, బీఆర్ రమేష్, గుగులోతు నందు తెలిపారు.
సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుతో పంటలకు రక్షణ కలుగుతోంది. కోతులు, పందులు, పశువులు చేలోకి రాకుండా కాపాడుకుంటున్నాం. నేను టమాట తోట రక్షణగా సౌర కంచె వేశాను. కోతల బెడద తప్పడంతో దిగుబడి, ఆదాయం పెరగింది.
– శ్రీనివాసరావు, తొడిదెలగూడెం గ్రామం


