● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ● మసివాగు వద్ద ఆటోను ఢీ కొట్టిన కారు ● మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఘోరం | - | Sakshi
Sakshi News home page

● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ● మసివాగు వద్ద ఆటోను ఢీ కొట్టిన కారు ● మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఘోరం

Mar 22 2026 1:52 AM | Updated on Mar 22 2026 1:52 AM

● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ● మసివాగు వద్ద ఆటోను ఢీ కొట్టిన కారు ● మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఘోరం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఇల్లెందు రూరల్‌: మండలంలోని మసివాగు తండా వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. ఇల్లెందు మీదుగా మసివాగుకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పాఖాల నుంచి ఇల్లెందు వైపు వస్తున్న కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గుగులోతు స్వప్న(58), బానోతు లక్ష్మి(55) అనే ఇద్దరు మృతిచెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108లో క్షతగాత్రులను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బాణోత్‌ రాజేశ్వరి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. మిగిలిన నలుగురికీ ఇల్లెందులో చికిత్స అందిస్తున్నారు.

అంతా ఒక కుటుంబం వారే..

కారేపల్లి మండలం చీమలపాడు సమీపంలోని బోటి తండాకు చెందిన స్వప్న తండ్రి బానోతు నంద్యా ఇటీవల చనిపోయాడు. దీంతో స్వప్న కుటుంబసభ్యులను నిద్రకోసం ఆమె చెల్లెలు స్రవంతి తన స్వగ్రామమైన మసివాగుకు ఆహ్వానించింది. ఈ క్రమంలో స్వప్న కుటుంబసభ్యులు మొత్తం ఏడుగురు ఆటోలో శనివారం రాత్రి బోటితండా నుంచి బయల్దేరారు. ఇల్లెందు దాటే వరకు ప్రయాణం సాఫీగానే సాగింది. మరికొన్ని క్షణాల్లో మసివాగు చేరకుంటారనగా వేగంగా దూసుకొచ్చిన కారు వీరి ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న వారు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. ఆటోను సైడ్‌ నుంచి ఢీ కొట్టడంతో వెనుక సీట్లో కూర్చున్న బాణోతు స్వప్న, లక్ష్మికి తీవ్ర గాయాలై ఘటనా స్థలిలోనే ప్రాణాలొదిలారు. మిగిలిన వారు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయి, తీవ్ర గాయాలతో రక్తసిక్తమయ్యారు. ఘటన జరిగిన తర్వాత ఆ దారిలో వెళ్లేవారు 108కు సమాచారం ఇచ్చారు. ఈలోగా స్థానికులు చేరుకుని గాయపడ్డవారికి సాయం చేశారు.

మద్యం మత్తుతోనే

కారు నడుపుతున్న వ్యక్తి అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. మరి కాసేపట్లో గమ్యస్థానం చేరుకుంటామనగా ఒక్కసారిగా కారు ఆటోపైకి దూసుకొచ్చిందని, అప్పటికీ ఆటో డ్రైవర్‌ ప్రేమ్‌ చాకచక్యంగా పక్కకు వెళ్లినా, ప్యాసింజర్‌ సీటు భాగం వద్ద కారు బలంగా ఢీ కొట్టిందని తెలిపారు. ఇంత జరిగినా కారు నడిపే వ్యక్తి కనీసం కిందకు దిగకుండా మత్తులో అందులోనే కూర్చున్నాడని చెబుతున్నారు. చివరకు ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్‌ ఘటనా స్థలానికి చేరుకుని కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా అతను మత్తులో నుంచి బయటకు రాలేదు.

రోదనలతో మార్మోగిన ఆస్పత్రి

రాత్రి 9:30 గంటలకు ప్రమాదం జరగగా పది గంటల సమయంలో ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. అప్పటికే ప్రమాద విషయం తెలుసుకున్న బోటి తండాకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం విషాదభరితంగా మారింది. ప్రమాదంలో గాయపడిన వారిలో బాణోతు ప్రేమ్‌, బాణోత్‌ శ్రీను, వనజ, మనోజ్‌ ఉన్నారు.

ట్యాంకర్‌ ఢీకొని ఒకరు మృతి

బూర్గంపాడు: మండల పరిధిలోని పోలవరం గ్రామ సమీపంలో శనివారం యాష్‌ ట్యాంకర్‌ ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న మోటార్‌ సైకిల్‌ను ఎదురుగా వస్తున్న యాష్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మోటార్‌ సైకిలిస్ట్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కారేపల్లి మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన కొండా దేవా(25)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ మేడా ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement