జూలూరుపాడు: పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గురువారం జూలూరుపాడు పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 18న జూలూరుపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లను తనిఖీ చేయగా 52 ప్యాకెట్లలో 105.54 కిలోల గంజాయి లభించింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ 52.77 లక్షలు ఉంటుందని అంచనా. రెండు కార్లలోని ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డొంకరాయి నుంచి ఖమ్మం, హైదరాబాద్ మీదుగా షిరిడీకి తరలిస్తున్నట్లు తేలింది. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం ఎర్రగాళ్లపల్లి గ్రామానికి చెందిన శివాకర్ ప్రమోద్ కుమార్, దేవరకొండ ఖిల్లా బజారుకు చెందిన బైరిశెట్టి భార్గవ్, రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం బీఏ రెడ్డి నగర్‌కు చెందిన అంధేకర్ శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్టు చేశారు. రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు అభి, లక్ష్మణ్, షారుక్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయిని పట్టుకునేందుకు కృషి చేసిన సీఐలు రమాకాంత్, శ్రీలక్ష్మి, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, రవిలను డీఎస్పీ అభినందించారు.
105 కిలోలు పట్టివేత, ముగ్గురి అరెస్ట్


