ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
అశ్వాపురం/గుండాల : జిల్లాలో గురువారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులు బీభత్సం స్పష్టించాయి. ఈదురుగాలులకు మొండికుంట నుంచి అశ్వాపురం వరకు మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై పలు చోట్ల చెట్లు రహదారిపై నేలకూలాయి. మొండికుంట–భద్రాచలం రహదారిపై నెల్లిపాక వద్ద రహదారిపై చెట్టు నేలకొరిగింది. రహదారులపై చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చెట్లు తొలగించడంతో రాకపోకలు కొనసాగాయి. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉదయం నుంచి మబ్బులు పట్టడంతో ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో రైతులు కల్లాల్లోని పంటను కాపాడుకునేందుకు పట్టాల కోసం పరుగులు తీశారు. మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. మొక్కజొన్న చేలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


