● మత్స్యంగ్రహణం, వాస్తు హోమంతో అంకురార్పణ ● ఆలయంలో నూతన తెలుగు సంవత్సరాది వేడుకలు ● చలువ పందిళ్లతో నవమి శోభ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం ఉత్సవమూర్తులకు ఉత్సవాంగ స్నపనం, మత్స్యంగ్రహణం, వాస్తుహోమం తదితర పూజలతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. కల్యాణ రుత్విక్‌లు, బ్రహ్మ, అర్చకులకు దీక్షా వస్త్రాలు అందజేస్తారు. సాయంత్రం కల్ప వృక్ష వాహనంపై స్వామివారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు. అలాగే పరాభవ నామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరాది వేడుకలు ప్రారంభించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. చివరగా ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యం పెట్టి భక్తులకు పంపిణీ చేస్తారు.
ఐదు నుంచి తొమ్మిది రోజులకు...
భద్రగిరి దివ్యక్షేత్రంలో తొలుత ఐదు రోజుల పాటు పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. కాలక్రమేణ అది ఏడు రోజులకు(సప్తాహ్నిక), ప్రస్తుతం నవాహ్నిక (తొమ్మిది రోజులు) తిరుకల్యాణోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగినా, తిరుకల్యాణోత్సవాలు ఈనెల 25న ప్రారంభమై ఏప్రిల్ 2న ముగియనున్నాయి. 26న సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం, 27న మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం, 28న పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.
చలువ పందిళ్లతో పెళ్లికళ..
వేసవి కాలంలో సీతారాముల కల్యాణం అంటే చలువ పందిళ్లే గుర్తొస్తాయి. ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్టుగా షామియానాలు, ఇతరత్రా సౌకర్యాలు వచ్చినప్పటికీ స్టేడియంపైన, ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో వెదురుతో కూడిన చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం భద్రాచలంలో ప్రత్యేకత. వీటితో భక్తులకు వేసవిలో ఉపశమనం కలిగించేలా చల్లటి వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు.


