రమణీయంగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

రమణీయంగా రామయ్య కల్యాణం

Mar 19 2026 7:46 AM | Updated on Mar 19 2026 7:46 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం రమణీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

త్వరలో సఫారీ టూర్‌

పాల్వంచరూరల్‌ : కిన్నెరసాని అభయారణ్యంలో పర్యాటకులు సహజసిద్ధ అటవీ ప్రాంతంలో సంచరించే జంతువులను చూసేందుకు వీలుగా వచ్చేనెల 15 – 20 తేదీల్లో సఫారీ టూర్‌ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు డీఎఫ్‌ఓ జి.కృష్ణాగౌడ్‌ తెలిపారు. బుధవారం ఆయన కిన్నెరసానిలోని డీర్‌ పార్క్‌ను, చైన్‌లింక్‌, ఔషధ మొక్కల ప్లాంటేషన్‌ పనులను వైల్డ్‌లైఫ్‌ ఎఫ్‌డీఓ బాబుతో కలిసి సందర్శించారు. అనంతరం జలాశయంలో బోటు ద్వారా ట్రెక్కింగ్‌ పాయింట్‌ వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి వాచ్‌టవర్‌ ఎక్కి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిన్నెరసాని నుంచి జలాశయంలో అటవీ శాఖ బోటు ఎక్కి మందరెకలపాడులోని వాచ్‌ టవర్‌ వెళ్లిన వీక్షకులు అక్కడ నుంచి సఫారీ వాహనంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లి తిరిగి అక్కడికే చేరుకునేలా, లేదంటే డీర్‌ పార్క్‌ వద్దే సఫారీ వాహనంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లి.. తిరిగి అక్కడే దిగేలా.. మొత్తంగా మూడు వాహనాలు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ఒక్కో వాహనంలో తొమ్మిది మంది ప్రయాణించవచ్చన్నారు. దీని ప్యాకేజీ వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement