రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
బూర్గంపాడు/భద్రాచలంటౌన్/ దుమ్ముగూడెం : భద్రాచలంలో నిర్మించిన మ్యూజియం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంలా ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం ఆయన జిల్లాకు రాగా, సారపాక ఐటీసీ గెస్ట్‌హౌస్ వద్ద పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని, పంచవటీ కుటీరం, నారచీరల ప్రాంత విశిష్టతను తెలుసుకున్నాక గోదావరిలో బోటు షికారు చేశారు. అనంతరం భద్రాచలంలోని గిరిజన మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనుల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కళాఖండాలు, పాతకాలపు ఇళ్ల నమూనాలు అద్భుతంగా ఉన్నాయని, మ్యూజియంలోని ప్రతి అంశంపై పర్యాటకులకు మరింత అవగాహన కల్పించేలా వీడియో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన సంక్షేమానికి ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అంతకుముందు ఐటీడీఏ అధికారులు ఘన స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో గిరిజన సంక్షేమ శాఖ డీడీ అశోక్, ఎస్సీ డెవలప్‌మెంట్ అధికారి శ్రీలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్, ఐటీడీఏ ఈఈ మధుకర్, బూర్గంపాడు తహసీల్దార్ కేఆర్‌కేవీ ప్రసాద్, ఏటీడీఓ చంద్రమోహన్, ఏఎస్‌డబ్ల్యూఓ హనుమంతరావు, అధికారులు అక్షయ్ సమ్మయ్య, ఉదయ్‌కుమార్, ప్రభాకర్, వేణు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


