రేపు బాక్సింగ్ జట్ల ఎంపిక
కొత్తగూడెంటౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లా బాక్సింగ్ జట్ల ఎంపిక పోటీలు కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో మంగళవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చీఫ్ ఫ్యాట్రన్ ఎర్రా కామేశ్ తెలిపారు. కొత్తగూడెంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యాన సీనియర్స్ విభాగంలో మహిళలు, పురుషుల జట్లను ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఇక్కడ ఎంపిక చేసే జట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయస్సు నిర్ధారణ పత్రంతో ఉదయం 9 గంటల వరకు ప్రగతి మైదానానికి రావాలని, వివరాల కోసం 98854 42131, 99490 83202 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రతిభ
మణుగూరు రూరల్ : రాష్ట్ర బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్‌లో మణుగూరు ప్రాంతానికి చెందిన కొమురెల్లి రవీందర్‌రెడ్డి ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఖమ్మంలో జరిగిన పోటీల్లో 93 కేటగిరీ రవీందర్‌రెడ్డి 115 కేజీల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. జనవరి 6న హరియాణాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
ఆత్మలింగేశ్వరాలయంలో పూజలు
పాల్వంచ: పట్టణంలోని శ్రీ ఆత్మలింగేశ్వరాలయాన్ని ఉత్తరప్రదేశ్‌లోని మధురలో మలూక పీఠానికి చెందిన పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు ఆదివారం సందర్శించారు. పీఠం బాధ్యులైన జగత్ గురుస్వామి రాజేంద్ర దాస్ జీ మహారాజ్ శిష్య బృందంతో ఈ నెల 6 నుంచి ఆలయాలను సందర్శిస్తూ వస్తున్నారు. 8వ రోజు యాత్రలో ఆత్మలింగేశ్వరాలయాన్ని సందర్శించారు. పూజలు నిర్వహించి, భిక్ష స్వీకరించారు. సనాతన ధర్మ పరిరక్షణ, గో పరిరక్షణకు యాత్ర చేపట్టినట్లు స్వామీజీలు తెలిపారు. దర్మకర్త మచ్చా శ్రీనివాసరావు, అర్చకుడు జితేంద్ర కుమార స్వామి పాల్గొన్నారు.


