అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి
● అమృత్ పథకం కింద రూ.249 కోట్లతో పనులు ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం అర్బన్: ఖమ్మంలో జరుగుతున్న అభి వృద్ధి పనుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ పది కాలాలు మన్నికగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని పలు డివిజన్లలో ఆదివారం పర్యటించిన ఆయన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు, కార్యాచరణపై ఆరా తీసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షపు నీరు, మురుగునీరు వేర్వేరుగా ప్రవహించేలా స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. తద్వారా చెరువులు కలుషితం కాకుండా రక్షించుకోవచ్చని చెప్పారు. అమృత్ పథకం ద్వారా రూ.249 కోట్లతో చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు వచ్చే వర్షాకాలానికి ముందే పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అలాగే, ఖానాపురం ఊరచెరువు నుంచి ధంసలాపురం చెరువు వరకు 8.5 కి.మీ. మేర ట్రంక్ పైప్‌లైన్, ధంసలాపురంలో 44 ఎంఎల్‌డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రం, పుట్టకోటలో 9.5 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎస్టీపీ పనులపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, కేఎంసీ ఎస్‌ఈ వి.రంజిత్, కార్పొరేటర్లు ఆళ్ల నిరోష అంజిరెడ్డి, చామకూర వెంకటేశ్వర్లు, జలవనరులశాఖ ఈఈ అనన్య, డీఈ ఉదయ్‌ప్రతాప్, తహసీల్దార్ సైదులు, కాంగ్రెస్ ఖమ్మం అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి పాల్గొన్నారు.


