వాగ్వాదాలు.. స్వల్ప ఘర్షణలు
అశ్వారావుపేటరూరల్:గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణలు జరిగాయి. మండలంలోని నారాయణపురం, ఊట్లపల్లి, జమ్మిగూడెం గ్రామ పంచాయతీల్లో ఇరుపార్టీల వర్గీయు ల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. జమ్మిగూడెం పంచాయతీలో ఆదివారం తెల్లవారుజాము న కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఓటర్లకు నగదు, చీరలు పంపిణీ చేస్తుండగా బీఆర్‌ఎస్ పార్టీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ వర్గీయులు బీఆర్‌ఎస్‌వారిపై దాడులు చేసి సెల్‌ఫోన్లు ధ్వంసం చేసినట్లు బాధితులు తెలిపారు. ఊట్లపల్లి పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గీయు ల మధ్య అభ్యర్థుల ప్రచారంపై ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. నారాయణపురం కేంద్రంలో పోలింగ్ సమయం ముగిశాక గ్రామానికి చెందిన బండి అమూల్య ఓటు వేసేందుకు వెళ్తున్న క్రమంలో బీఆర్‌ఎస్ వర్గీయులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో అమూల్య కిందపడిపోగా, కాలుకు స్వల్ప గాయం కావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో సీఐ నాగరాజు, ఎస్సై యయాతీ రాజు, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను
చెదరగొట్టారు.
వాగ్వాదాలు.. స్వల్ప ఘర్షణలు


