‘వికాస తరంగణి’ ద్వారా విస్తృత సేవలు
● త్రిదండి చినజీయర్‌స్వామి
సత్తుపల్లిటౌన్: సమాజ హితం కోసం వికాసతరంగణి విశేషమైన సేవలు అందిస్తోందని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి తెలిపారు. సత్తుపల్లిలోని సమగ్ర కాంప్లెక్స్ వద్ద శనివారం ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు వికాతరంగణి ద్వారా స్వర్ణామృత ప్రాశన పంపిణీ జరుగుతోందని తెలిపారు. సమాజానికి వెన్నుముక అయిన మహిళలు బ్రెస్ట్ కేన్సర్ బారిన పడకుండా లక్షలాది మందికి అవగాహన కల్పిస్తూనే అవసరమైన వారికి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే, ప్రజ్ఞా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వీటన్నిటికి మూలాధారం శ్రీరామచంద్రుడేనని, శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని మానవసేవను మాధవ సేవగా చేపడుతున్నామని తెలిపారు. అనంతరం రేజర్లలోని నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణమాచార్య నివాసంలో పాదపూజ నిర్వహించారు.
మంత్రి తుమ్మల పూజలు
సత్తుపల్లిలోని సమగ్ర కాంప్లెక్స్ వద్ద శ్రీదేవి, భూదేవి సమ్మేత శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యావావచనం, రక్షాబంధనం అనంతరం వేద మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ ఘట్టాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


