ఇసుక రవాణా నిలిపివేత
మణుగూరు రూరల్ : మండలంలోని ర్యాంపుల నుంచి ఇసుక రవాణా సాగించేందుకు రాజుపేట, గుట్టమల్లారం అటవీ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా తాత్కాలిక రహదారులను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రాజుపేట గ్రామస్తులు హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఇసుక రవాణాను నిలిపివేయాలంటూ అధికారులను ఆదేశించింది. దీంతో శనివారం మణుగూరు అటవీశాఖ అధికారులు రహదారులను మూసివేసి ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేశారు. అయితే అన్నారం, చినరాయిగూడెం ఇసుక సొసైటీ సభ్యులు మణుగూరు ఎఫ్‌డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇసుక లారీలను నిలిపివేస్తే తమకు జీవనాధారం పోతుందని ఎఫ్‌డీఓకు వినతిపత్రం ఇచ్చారు. కాగా అనుమతులు లేకుండా లారీలతో ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీఓ మక్సూద్ మొహియుద్దీన్ హెచ్చరించారు.


