ఇసుక రవాణాకు హైకోర్టు బ్రేక్
మణుగూరురూరల్: మున్సిపాలిటీ పరిధిలో కొన్ని నెలలుగా ప్రజలకు ప్రమాదకరంగా పరిణమించిన ఇసుక, బొగ్గు రవాణాకు శుక్రవారం హైకోర్టు బ్రేక్ వేసింది. అనుమతులు లేకున్నా రాజుపేట గ్రామం మీదుగా దుమ్ము, ధూళి ఎగిసిపడేలా దూసుకెళ్తున్న లారీలు గ్రామాన్ని నిత్యం కప్పేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ విషయంపై గ్రామస్తులు పలుమార్లు సింగరేణి, మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. లారీల మితిమీరిన వేగం, ఎగిసిడే దుమ్ము, ధూళితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పలువురు పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. అయినా ఇసుక, బొగ్గు రవాణా ఆగలేదు. చివరికి గ్రామస్తుల ఆవేదన విన్న హైకోర్టు న్యాయవాది చప్పిడి రామకృష్ణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజుపేట పరిస్థితులపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యానికి, జిల్లా కలెక్టర్‌కు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీంతో అధికార యంత్రాంగం కదిలి కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ గ్రామం మీదుగా జరుగుతున్న ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేసింది. రాజుపేట సమీపంలోని అటవీ భూభాగంలో అనుమతులు లేకుండా ఏళ్ల నాటి చెట్లను భారీ యంత్రాలతో నరికివేయించి రాత్రింబవళ్లు ఇసుక రవాణాను సాగిస్తున్నట్లు న్యాయవాది రామకృష్ణ మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అటవీ నాశనంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లారీలు ఆపి.. తర్వాత మళ్లీ ఇసుక రవాణా యథావిధిగా సాగుతుండటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడవిలో చెట్ల నరికివేతపై ఆగ్రహం


