ఫలితాలు మెరుగుపడేనా?
పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారు
ఇన్‌చార్జుల పాలనలో కొనసాగుతున్న విద్యాశాఖ
గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత పెరిగేనా..?
కొత్తగూడెంఅర్బన్: ఇన్‌చార్జ్ అధికారుల పాలన, అంతకుమించి పనిఒత్తిడి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు సర్వేలు తదితర బోధనేతర పనులు అప్పగించడంతో ఈసారి విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారు కావడంతో విద్యార్థులతోపాటు ఉసాధ్యాయులకు కూడా పరీక్షగా మారింది.
ఎంఈఓలు, డీఈఓ ఇన్‌చార్జులే..
జిల్లా విద్యాశాఖలో ఎంఈఓల నుంచి డీఈఓల వరకు ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు పాఠశాలల్లో బోధన పనుల కంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సర్వేలు, ఎన్నికల విధులు వంటివి ఎక్కువగా నిర్వహిస్తున్నారు. అసలే ఇన్‌చార్జ్‌ల పాలన ఆపై వివిధ రకాల విధులతో బోధన, విద్యార్థులపై పర్యవేక్షణ లేకుండాపోయినట్లు కనిపిస్తోంది. గతేడాది పదో తరగతి, ఇంటర్మీడియట్‌లలో చెప్పుకోదగిన ఫలితాలు రాలేదు. ఈ ఏడాది సబ్జెక్ట్ టీచర్లు ఉన్నా ఇతర పనులు ఎక్కువ కావడంతో పర్యవేక్షణ కొరవడింది. వెరసి విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం పడే అవకాశం ఉంది.
కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు
పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మెరుగైన ఫలితాల కోసం పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్ర వేళల్లో పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సాయంత్ర వేళ ఒక గంట ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 302 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 12,828 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. వీరితోపాటు మరో 394 మంది సప్లిమెంటరీ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 27వ స్థానంలో నిలువగా 91.49శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 62.56శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 9వ స్థానం లభించింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్‌లో 10,111 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 10,085 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు.
జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. స్లిప్ టెస్టులను నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. గతేడాదికంటే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరుగుతుంది.
–నాగలక్ష్మి, డీఈఓ
పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జనవరిలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రీ ఫైనల్ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తామని, అనంతరం వారిపై మరింత శ్రద్ధ పెడతామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు మొదలు కానున్నాయి. కాగా అపరాధరుసుంతో ఈ నెల 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది.
ఫలితాలు మెరుగుపడేనా?


