ఎందుకిలా..?
159 గ్రామ పంచాయతీల్లో..
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలోనే అత్యల్పంగా నమోదు
ఓటర్లను బూత్‌కు తరలించడంలో విఫలం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటరు పోలింగ్ బూత్‌కు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఓటర్‌ను బ్యాలెట్ పేపర్ దిశగా నడిపించడంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు వెనుకబడ్డారు. ఫలితంగా 71.79 శాతం పోలింగ్‌తో జిల్లా రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో నిలిచింది.
అభ్యర్థులకు సమయం సరిపోలేదా..?
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. వార్డుస్థాయిలో ఒకటి రెండు ఓట్ల తేడా వల్ల కూడా ఫలితాలు తారుమారు అవుతాయి. ఈ క్రమంలో ప్రతీ ఓటరును బూత్ వరకు తీసుకొచ్చేందుకు అభ్యర్థులు శ్రద్ధ వహిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తొలి విడతలో ఉన్న పంచాయతీల నుంచి వార్డు మెంబర్‌గా, సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నవారు అప్పటికప్పుడు అప్రమత్తం కావాల్సి వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మద్దతుదారులను కూడగట్టుకోవడం, ప్రత్యర్థులను బుజ్జగించడం వంటి పనులకే చాలా సమయం పోయింది. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ నుంచి గుర్తులు కేటాయించే వరకు అభ్యర్థులకు తీరికలేదు. ప్రచారం మొదలైన తర్వాత తమకు కేటాయించిన గుర్తును ఓటర్లలోకి తీసుకెళ్లడానికే సమయం సరిపోయింది. దీంతో పోలింగ్ రోజున దగ్గరుండి ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురావడంలో ఓటర్లు, పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య సమన్వయం లోపం ఎదురైంది. అందువల్లే ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను గ్రామాలకు రప్పించడం, గ్రామాల్లో ఉంటూనే పొలం పనులకు, ఉద్యోగాలకు వెళ్లే వారిని ఓటు వేసేలా ప్రేరేపించడంలో తగినంత కసరత్తు జరగలేదు. ఫలితంగా ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అతి పెద్ద పంచాయతీగా ఉన్న భద్రాచలంలో 40 వేల మందికి పైగా ఓట్లు ఉంటే అక్కడ పోలింగ్ 48.87 శాతం దగ్గరే ఆగిపోయింది. అతి పెద్ద పంచాయతీలోనే సగం మంది ఓటర్లు తమ సర్పంచ్ ఎంపికకు దూరంగా ఉన్నట్లయింది. మలి, తుది విడత ఎన్నికల సమయానికై నా జిల్లాలో ఓటింగ్ శాతం పుంజుకునేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపించాల్సిన అవసరం ఉంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో నోటిఫికేషన్ వెలువడే వరకు ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం లేదు. ఎట్టకేలకు నవంబర్ 25న నోటిఫికేషన్ జారీ చేశారు. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించారు. ఇందులో మొదటి విడతలో జిల్లాలో పినపాక, అశ్వారావుపేట నియోజకర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల పరిధిలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 14 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట ఈ నెల 11న ఎన్నికలు జరిగాయి. ఇందులో పోలింగ్ శాతం కేవలం 71.79 శాతమే నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్ శాతంగా ఉంది.
తొలివిడత ఎన్నికల్లో 71.79 శాతమే పోలింగ్
ఎందుకిలా..?


