స్వర్ణకవచధారణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామిదేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీకనకదుర్గమ్మకు
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మకు శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.
నేడు నవోదయ పరీక్ష
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో శనివారం నిర్వహించనున్న నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనుందని, 8 కేంద్రాల్లో 1,852 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. విద్యార్థులు అడ్మిట్ కార్డు, హాల్ టికెట్, పరీక్ష సామగ్రి తెచ్చుకోవాలని తెలిపారు. అదనపు సమాచారం కోసం ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ను 99890 27943 నంబరులో సంప్రదించాలని సూచించారు.
నేడు సింగరేణి
ప్రణాళికలపై సమీక్ష
రుద్రంపూర్: హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఈ నెల 13న బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదక, భవిష్యత్ ప్రణాళికలపై సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కోల్ సెక్రటరీ విక్రమ్ దేవ్ దత్తాతోపాటు కేంద్ర ఇంధన శాఖ అధికారులు, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఇతర డైరెక్టర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 2030 నాటికి చేపట్టే మధ్యకాలిక ప్రణాళిక, 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 5,850 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ దీర్ఘకాలిక ప్రణాళికలు, 15 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్, కీలక ఖనిజ రంగంలో ప్రవేశం, అంతర్జాతీయస్థాయిలో గ్లోబల్ సింగరేణి లిమిటెడ్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించినున్నట్లు సమాచారం.
సభ్యత్వ నమోదులో పాలుపంచుకోవాలి
ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదులో అందరూ చురుగ్గా పాల్గొనాలని ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాస్ సూచించారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. సభ్యత్వ నమోదును విజయవంతం చేయడంతో పాటు 2026 డైరీ రూపకల్పనలో పాలుపంచుకోవాలని తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, బకాయిలు విడుదల చేయడంతో పాటు ఈహెచ్‌ఎస్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. జెడ్.ఎస్.జైపాల్, విజయ్ కుమార్, జి.బాలకృష్ణ, వల్లపు వెంకన్న పాల్గొన్నారు.
స్వర్ణకవచధారణలో రామయ్య


