భద్రగిరిలో తీవ్ర నిరీక్షణ
● అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యంగా కౌంటింగ్ ● అందరికీ ఓటర్ల స్లిప్‌లు పంపిణీ చేయలేదనే ఆరోపణలు ● భద్రాచలం పంచాయతీలో అతి తక్కువ పోలింగ్ శాతం
భద్రాచలం: అధికారుల నిర్లక్ష్యంతో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు పడిగాపులు కాశారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు సర్పంచ్ ఫలితాలు వెల్లడికాకపోవడంతో రాత్రంతా అభ్యర్థులు, వారి మద్దతుదారులు, కార్యకర్తలు చలిలో గజగజ వణికిపోయారు. గురువారం ఉదయం ఏడు నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ ముగియాల్సి ఉంది. ఒంటిగంటలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వడంతో కొంత సమయం పట్టింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల లోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి బ్యాలెట్ బాక్స్‌లు చేర్చి కౌంటింగ్ ప్రారంభించాల్సి ఉంది. కానీ తీవ్ర జాప్యం జరిగింది. తన ఓటు హక్కును మరొకరు వినియోగించుకున్నారనే ఫిర్యాదుతో వెంకటలక్ష్మి అనే ఓటరుకు టెండర్ ఓటును కేటాయించారు. ఆ ఓటు కౌంటింగ్, విధి విధానాలు స్థానిక ఎన్నికల అధికారులకు తెలియకపోవడంతో రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమాచారం తెలుసుకున్న అనంతరం బ్యాలెట్ బాక్సులోని ఓట్లను కట్టలు కట్టడం ప్రారంభించారు. దీంతో రాత్రి ఏడు గంటల వరకు కౌంటింగ్ ప్రారంభం కాలేదు. ఈ సమయంలో బయట వేచి చూస్తున్న అభ్యర్థులకు, పార్టీ కార్యకర్తలకు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. బీఆర్‌ఎస్ నాయకులు కౌంటింగ్ కేంద్రంలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు సైతం చేశారు. అఽధికారుల నిర్లక్ష్యం వల్ల భద్రాచలం పంచాయతీ సర్పంచ్ ఫలితం శుక్రవారం తెల్లవారుజామున వెలువడింది. అప్పటివరకు చలిలో అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అతి తక్కువగా భద్రాచలంలో ఓటింగ్
జిల్లావ్యాప్తంగా అత్యధిక ఓటర్లు ఉన్న భద్రాచలం గ్రామపంచాయతీలో అతి తక్కువగా 48.87 శాతం పోలింగ్ నమోదయింది. ఓటర్లు స్లిప్‌లు ఇంటింటికీ చేరవేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఓటరు జాబితా ప్రకారం పోలింగ్ కేంద్రాల వివరాలు ముందస్తుగా ప్రచారం చేయలేదు. దీంతో ఓటర్లు భద్రాచలంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రచారానికి అతి తక్కువ రోజులు ఉండటంతో వార్డు మెంబర్ పోటీదారులు తప్ప సర్పంచ్ పోటీదారులు అన్ని కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేయలేకపోయారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా ప్రభావం చూపలేకపోయారు. ఇతర ప్రాంతాలు, నగరాల్లో ఉంటున్న పట్టభద్రులు, ఉద్యోగులను భద్రాచలం తీసుకురాలేకపోయారు. ఇక ప్రధానంగా పోటీదారులు ఓటుకు నోటునే బలంగా నమ్ముకోవడంతో అత్యధిక ఓటర్లు, వృద్ధులు నోటు తీసుకొని చడీచప్పుడు చేయకుండా ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో 40,761 ఓట్లకుగాను 19,838 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి.


