పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
ముక్కోటి పోస్టర్ల ఆవిష్కరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ రోహిత్‌రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్‌రెడ్డి, వ్యయ పరిశీలకురాలు లావణ్య, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో శుక్రవారం రాత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి తాగునీరు, భోజనం, విద్యుత్, స్ట్రాంగ్ రూం ఏర్పాట్లు తదితర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, రిజిస్టర్లు, ఇతర ఎన్నికల సామగ్రి నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేర్చాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటరు రిజిస్టర్ కచ్చితంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితులలో దొంగ ఓట్లకు అవకాశం ఇవ్వరాదని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడంతోపాటు రెండువేలకు పైగా ఓటర్లు ఉన్న జగన్నాథపురం, నరసాపురం, పెద్దిరెడ్డిగూడెం, వినాయకపురం, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట తదితర ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఓటర్లలో అవగాహన పెంచేందుకు పంచాయతీ వాహనాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ రెండో విడత ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రెండో విడత ఎన్నికల సమీక్షలో
కలెక్టర్ జితేష్
భద్రాచలంలో ఈనెల 29, 30 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి వాల్ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లను అంటిస్తామని తెలిపారు. సౌకర్యాలపై ఈ నెల 15న భద్రాచలం సబ్ కలెక్టరేట్‌లో డివిజన్‌స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. దేవస్థానం ఈఓ దామోదర్‌రావు, అర్చకులు పాల్గొన్నారు.


