పొదెంXతెల్లం!
భద్రాచలం: భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్యల మధ్య వర్గపోరు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరోసారి బహిర్గతమైంది. ఉపసర్పంచ్ ఎంపికపై రగడ నెలకొంది. ఉపసర్పంచ్ పదవికి ఎమ్మెల్యే వర్గం నుంచి రత్నం కవిత, మాజీ ఎమ్మెల్యే పొదెం వర్గం నుంచి చెంచు సుబ్బారావు పోటీపడ్డారు. దీంతో పొదెం అనుచరుడికి తొలుత మూడేళ్లు, ఆ తర్వాత రెండేళ్లు ఎమ్మెల్యే అనుచరుడికి పదవి ఇచ్చేలా కౌంటింగ్ కేంద్రం బయట ఇద్దరు నేతలు చర్చించుకుని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లాక ఎమ్మెల్యే వర్గం సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. అత్యధిక సభ్యులు రత్నం కవితకు మద్దతు తెలపటంతో ఆమెనే ఉప సర్పంచ్‌గా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా ఎమ్మెల్యే వర్గం ఒప్పందాన్ని పాటించకపోవడంతో పొదెం వీరయ్య తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మాట తప్పారని, చివరి రెండేళ్లు తమవారికి ఉప సర్పంచ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే నుంచి మాత్రం ఎటువంటి స్పష్టత రాలేదు.
పదవులు ఉన్నా, లేకున్నా..
భద్రాచలంటౌన్: పదవులు ఉన్నా, లేకున్నా కార్యకర్తగా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై శుక్రవారం పార్టీ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పార్టీపై అసంతృప్తి పెరిగిపోయిందని, దీనికి ఎమ్మెల్యే వెంకట్రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధిష్టానానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా స్పష్టమైన వివరణ రాలేదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులమని చెప్పుకుంటూ కొందరు పరోక్షంగా బీఆర్‌ఎస్ మద్దతుదారుల కోసం పనిచేశారని ఆరోపించారు. పరిమి శ్రీనివాసరావు, తమ్మల్లా వెంకటేశ్వరరావు, అడబాల వెంకటేశ్వరరావు, కోలపుడి వరుణ్, వాసిరెడ్డి సాంబశివరావు, కాపుల శ్రీను, బసవరాజు, సరిత, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉప సర్పంచ్ ఎంపికపై ఇరువర్గాల రగడ


