తొలిపోరు ప్రశాంతం
జిల్లాలో 71.79 శాతం పోలింగ్ నమోదు
భద్రాచలంలో అత్యల్పంగా 48.87 శాతం
ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
చుంచుపల్లి : జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో పోలింగ్ జరగగా, మొత్తం 71.79 శాతంగా నమోదైంది. అత్యధికంగా దుమ్ముగూడెం మండలంలో 85.08 శాతం ఓట్లు పోలవ్వగా, అత్యల్పంగా భద్రాచలంలో 48.87 శాతం మాత్రమే నమోదయ్యాయి. 145 గ్రామపంచాయతీలు, 1,097 వార్డులకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ కొంత మందకొడిగానే సాగగా, అప్పటివరకు 13.57 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ తర్వాత అంతటా పోలింగ్ ఊపందుకుంది. 11 గంటల వరకు 41.44 శాతం, పోలింగ్ పూర్తయ్యే సరికి 71.79 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒంటి గంట లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లను అధికారులు లోపలికి అనుమతించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించగా, ఎస్పీ రోహిత్‌రాజు భద్రాచలం, మణుగూ మండలం సమితి సింగారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
కౌంటింగ్ సాగిందిలా..
మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ పూర్తి కాగా, 2 గంటలకు అధికారులు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. మొదట వార్డుల వారీగా లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు. అనంతరం సర్పంచ్ స్థానాలకు కౌంటింగ్ చేపట్టి విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. విజేతలుగా నిలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు రంగులు చల్లుకుని, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
మహిళలదే హవా..
తొలివిడత ఎనిమిది మండలాల పరిధిలో 145 గ్రామ పంచాయతీలు, 1,097 వార్డులకు ఎన్నికలు జరగగా అన్ని చోట్లా పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటి పరిధిలో మొత్తం 2,59,070 మంది ఓటర్లు ఉండగా, 1,85,974 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో పురుషులు 90,175 మంది కాగా, మహళా ఓటర్లు 95,794 మంది ఉన్నారు.
ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు
తొలిపోరు ప్రశాంతం
తొలిపోరు ప్రశాంతం


