యార్డుల్లో యాతన | - | Sakshi
Sakshi News home page

యార్డుల్లో యాతన

Dec 12 2025 6:31 AM | Updated on Dec 12 2025 6:31 AM

యార్డ

యార్డుల్లో యాతన

చెత్త వేసేందుకు సరిపడా లేని స్థలం

డంపింగ్‌ యార్డుల నుంచి రోడ్లపైకి వస్తున్న వ్యర్థాలు

పూర్తిస్థాయిలో చేపట్టని బయోమైనింగ్‌ ప్రక్రియ

నిరుపయోగంగా వర్మికంపోస్టు తయారీ యంత్రాలు

కొత్త యార్డుల ఏర్పాటుకు సన్నాహాలు

– సుజాత, కొత్తగూడెం కార్పొరేషన్‌ కమిషనర్‌

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయినా డంపింగ్‌ యార్డుల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఉన్న యార్డు సరిపోకపోవడంతో రోజువారీ వెలువడుతున్న చెత్తను కొంత మేర రోడ్ల వెంటే వేయాల్సి వస్తోంది. దీంతో రహదారులపై దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేషన్‌లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మరో రెండు డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నారు. కొత్తగూడెంలో రోజువారీ చెత్త 30 మెట్రిక్‌ టన్నులు వెలువడుతుండగా పాల్వంచలో కూడా అదే స్థాయిలో సేకరణ జరుగుతోంది. ఇక కార్పొరేషన్‌లో విలీనమైన సుజాతనగర్‌ మండల పరిధిలోని నాలుగు డివిజన్లలో వెలువడే చెత్తను అక్కడే డంప్‌ చేస్తున్నారు. జనాభాకు తగ్గట్టుగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, వాహనాలు పెంచడంతో పాటు కొత్త డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కార్మికులు సరిపడా లేకపోవడంతో రోజు వారి కూలీలతో పని కానిచ్చేస్తున్నారు. ఇక కొత్తగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీలో డంపింగ్‌ యార్డే లేదు. రోజువారీ వెలువడే చెత్తను నివాసాల సమీపంలోనే డంప్‌ చేస్తున్నారు. మణుగూరు మున్సిపాలిటీలో రోజుకు 12 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరిస్తున్నా సమీపాన అన్నారంలోని డంపింగ్‌ యార్డుకు తరలించాలంటే వర్షాకాలంలో ట్రాలీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

బయో మైనింగ్‌ పూర్తయ్యేదెప్పుడో..

గతంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో వెలువడే చెత్తను రామవరం డంపింగ్‌ యార్డులో వేసేవారు. అయితే అక్కడ రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు తరచూ చెత్త తగులబెడుతుండడంతో దట్టమైన పొగ వ్యాపించి సమీప ప్రజలు ఇబ్బంది పడేవారు. దీంతో స్థానికులు చెత్త ట్రాలీలను అడ్డుకుని ఆందోళన చేయడంతో అక్కడ డంప్‌ చేయడం మానేశారు. గత మూడేళ్లుగా పాతకొత్తగూడెంలోని మొర్రేడువాగు సమీపంలోని డంపింగ్‌ యార్డులో వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 30వేల మెట్రిక్‌ టన్నులకు పైగా చెత్త పేరుకుపోయింది. దీంతో ఇప్పుడు సేకరిస్తున్న చెత్త రోడ్లపైనే వేయాల్సి వస్తోంది. ఈ యార్డులో లక్ష మెట్రిక్‌ టన్నుల చెత్త తొలగించేందుకు ఆరు నెలల క్రితం బయోమైనింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటివరకు 33 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త నుంచి గాజు, ప్లాస్టిక్‌ వేరు చేశారు. పొడి చెత్త, ప్లాస్టిక్‌ వస్తువులు, గాజును క్రాష్‌ చేసి సిమెంట్‌ కంపెనీలకు పంపుతున్నారు. అయితే ఇంకా 67 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త బయోమైనింగ్‌ చేయాల్సి ఉండగా మూడు నెలల సమయం పడుతుందని కార్పొరేషన్‌ అధికారులు అంటున్నారు. పాల్వంచలోనూ బయోమైనింగ్‌కు అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేసినా.. ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఇక డంపింగ్‌ యార్డుల్లో వర్మికంపోస్టు తయారీకి నిర్మించిన బెడ్లు ప్రస్తుతం వృథాగా ఉన్నాయి. వర్మీ కంపోస్టు తయారు చేసి, తక్కువ ధరకు కొత్తగూడెం చుట్టుపక్కల గ్రామాల రైతులకు అమ్మితే కార్పొరేషన్‌కు కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది.

కార్పొరేషన్‌ పరిధిలో కొత్త డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. రామవరంలోని పాత డంపింగ్‌ యార్డులో బయోమైనింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఆ పని పూర్తయితే యార్డును పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడా జాప్యం కాకుండా పర్యవేక్షిస్తున్నాం.

యార్డుల్లో యాతన1
1/1

యార్డుల్లో యాతన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement