నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, శ్రీ సీతారామచంద్ర స్వామిని విశాఖపట్నంలోని డీఎస్ నేషనల్ లా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.సూర్యప్రకాష్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోకి కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేద పడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
13న నవోదయ ప్రవేశపరీక్ష
కూసుమంచి: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని నవోదయ విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 13న పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఎనిమిది చొప్పున, ములుగు జిల్లా వెంకటాపురంలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు పాలేరు నవోదయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,737 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.
విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతుల పరీక్ష
13, 14వ తేదీల్లో ఏర్పాటు
పాల్వంచ: విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదోన్నతుల కోసం పాల్వంచలోని జెన్‌కో ట్రైనింగ్ సెంటర్‌లో ఈనెల 13, 14 తేదీల్లో (డిపార్ట్‌మెంట్ అకౌంట్స్ టెస్ట్) పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కం సంస్థల్లో పనిచేసే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ (జేఏఓ), ఏఈలు సైతం పదోన్నతులు రావాలంటే ఈ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తుండగా, ప్రస్తుతం పాల్వంచలో ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు.
16 నుంచి క్రికెట్ టోర్నీ
రుద్రంపూర్: ఈనెల 16 నుంచి 18 వరకు కొత్తగూడెంలోని జయశంకర్ మైదానంలో కంపెనీ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఏరియా జీఎం ఎం.శాలేంరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం – కార్పొరేట్, ఇల్లెందు – మణుగూరు, భూపాలపల్లి, రామగుండం రీజియన్, శ్రీరాంపూర్, బెల్లంపెల్లి – మందమర్రి ఏరియాలను కలుపుతూ ఆరు టీమ్‌లుగా ఏర్పాటు చేశామని వివరించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
టాస్‌తో వార్డు
సభ్యురాలి విజయం
దుమ్ముగూడెం: మండలంలోని అచ్చితాపురం పంచాయతీలోని ఐదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సోయం కౌసల్య, ఎవీఎస్పీ అభ్యర్థి సోయం నగ్మాకు చెరో 24 ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి కౌసల్యను విజయం వరించింది.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం


