రెండో విడత ప్రచారాలకు నేటితో తెర
చుంచుపల్లి: జిల్లాలో ఈనెల 14న జరిగే రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారాలకు శుక్రవారం సాయంత్రంతో తెరపడనుంది. మలి దశలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల పరిధిలోని 155 గ్రామపంచాయతీలు, 1,384 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 16 గ్రామ పంచాయతీలు, 240 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇవి మినహాయించి మిగతా చోట్ల గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ హామీలు గుప్పించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం వినూత్న రీతిలో ప్రచారం సైతం నిర్వహించారు. పాదయాత్రలు, మైకు ప్రచారాలతో గ్రామాలు హోరెత్తాయి.


