నర్సింగ్‌హోంలో డీఎంహెచ్‌ఓ తనిఖీ
పాల్వంచ: పట్టణంలోని దమ్మపేటరోడ్‌లో గల విజయ నర్సింగ్ హోంను డీఎంహెచ్‌ఓ తుకారంరాథోడ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఆస్పత్రిలో శిశువు మృతిపై వస్తున్న ఆరోపణలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వైద్యులు విజయలక్ష్మికి, సిబ్బందికి సూచనలిచ్చారు. ఆస్పత్రిలో రోగులకు అందించే సేవల ధరల పట్టిక రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని, ల్యాబ్‌లో నిర్వహించే రక్త పరీక్షల ధరలు, ఆస్పత్రిలో పనిచేసే వైద్యుల పేర్లు కూడా అందులో ఉండాలన్నారు. కాన్పులు నిర్వహించే గదులు శుభ్రంగా ఉంచాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ పీఎంఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ ట్రావెల్ బస్సులో పొగలు
పాల్వంచ: భద్రాచలం నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు వెనక భాగం నుంచి పొగలు రావడంతో ఆందోళన నెలకొంది. పాల్వంచ మీదుగా గురువారం ఈ బస్సు వెళ్తుండగా నవభారత్ వద్ద బస్సు వెనుక భాగం నుంచి పొగలు మొదలై లోపల కమ్ముకున్నాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో పక్కన నిలిపివేశాడు. అనంతరం మరమ్మతులు చేయడంతో పొగలు నిలిచిపోగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సాంకేతిక లోపంతోనే పొగలు వచ్చినట్లు తెలిసింది.
ట్యాంకర్ బోల్తా..
ములకలపల్లి: రసాయనాలు తరలిస్తున్న ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ పవన్ (27) ట్యాంకర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలోని గోపాలపురం నుంచి హైడ్రో క్లోరిక్ ఆమ్లం (హెచ్‌సీఎల్)తో రాయపూర్‌కు బయలుదేరాడు. బుధవారం అర్ధరాత్రి మండలంలోని రాజుపేట శివారులో పాములేరు వాగు వంతెన సమీపంలో ట్యాంకర్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి లోయలోకి దూసుకుపోయింది. క్యాబిన్ నుజ్జునుజ్జుకావడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్‌ఐ ఘటనా ప్రదేశానికి చేరుకున్నా, అర్ధరాత్రి కావడం, ట్యాంకర్ చుట్టూ చెట్టుకొమ్మలు అల్లుకొని ఉండడం, యాసిడ్ లీకై ఘాటైన వాసన వస్తుండటంతో రక్షణ చర్యలు చేపట్టలేకపోయారు. గురువారం వేకువజామున రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపకశాఖ సహకారంతో లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న పవన్ మృతదేహాన్ని బయటకు తీసి, కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి మార్చరీకి తరలించారు. ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ వివరించారు.
నర్సింగ్‌హోంలో డీఎంహెచ్‌ఓ తనిఖీ
నర్సింగ్‌హోంలో డీఎంహెచ్‌ఓ తనిఖీ


