దొంగ ఓటు కలకలం..
● భద్రాచలంలో ఘటన ● టెండర్ ఓటు వేయించిన అధికారులు
భద్రాచలంఅర్బన్: రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం జరగగా భద్రాచలం పట్టణంలోని 4వ వార్డుకు చెందిన కోటగిరి వెంకటలక్ష్మి కూనవరం రోడ్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని 11వ నంబర్ బూత్‌కు వెళ్లింది. అధికారులు వివరాలు పరిశీలించి.. తమ ఓటు ఇప్పటికే పోలైందని, మళ్లీ ఓటు వేసేందుకు అవకాశం లేదని చెప్పడంతో సదరు ఓటరు షాక్‌కు గురైంది. ఇదే విషయంపై భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌తో పాటు ఇతర అధికారులకు తెలపడంతో.. ఆమెతో అధికారులు టెండర్ ఓటు వేయించారు. కాగా, భద్రాచలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ అంశంపై తహసీల్దార్ మాట్లాడుతూ.. అది రిగ్గింగ్ కాదని, ఓట్లు పరిశీలించే అధికారి తప్పిదం వల్లే జరిగిందని చెప్పినా.. అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఎమ్మెల్యే వెంకట్రావుతో వాగ్వాదం..
ఓట్ల రిగ్గింగ్ జరిగిందని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు స్థానికులు, కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్‌ఎస్ నాయకురాలు తెలిపారు. వార్డు సభ్యుడిగా బరిలో నిలబడిన అభ్యర్థిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతివ్వడం లేదని చెప్పడంతో ఎమ్మెల్యే అక్కడే ఉండి అభ్యర్థిని కేంద్రంలోకి పంపించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నాయకురాలు.. ఓట్ల రిగ్గింగ్‌పై నిలదీయడంతో ఎమ్మెల్యేకు ఆమెకు మధ్య వాగ్వాదం జరిగింది.
టెండర్ ఓటు అంటే..?
ఓటింగ్ సమయంలో ఒకరి ఓటును మరొకరు వేస్తుంటారు. దీంతో అసలు ఓటర్ తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతాడు. అయితే, అలా జరగకుండా భారత ఎన్నికల సంఘం 1961లో సెక్షన్ 49(పీ)ను అమల్లోకి తెచ్చింది. ఓ వ్యక్తి ఓటును మరో వ్యక్తి వేస్తే ఈ సెక్షన్ ద్వారా టెండర్ ఓటు వేసే అవకాశం ఉంది. పోలింగ్ అధికారులు అసలు ఓటరు అతడేనని నిర్ధారించుకుంటే సాధారణ బ్యాలెట్ పేపర్ బండిల్లోని చివరి బ్యాలెట్‌ను ఇస్తారు. టెండరు బ్యాలెట్‌గా ఓటు వేయడానికి అనుమతిస్తారు. అయితే, ఆ టెండరు ఓటును బ్యాలెట్ బాక్సులో వేయకుండా ప్రిసైడింగ్ అధికారికి అప్పగిస్తారు. దానిని ప్రత్యేక కవర్లో పెట్టి టెండర్ బ్యాలెట్ వివరాలను సంబంధిత ఫారంలో నమోదు చేస్తారు.
దొంగ ఓటు కలకలం..


