పోలింగ్ కేంద్రం సమీపంలో ఉద్రిక్తత
మణుగూరురూరల్: స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇరువైపులా టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. కాగా, తహసీల్దార్ కార్యాలయ ఎదురు వీధిలో టెంటు అడ్డంగా వేసి వచ్చే ఓటర్లకు గుర్తులు చూపి ప్రలోభ పెడుతున్నారంటూ బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఘర్షణ వాతావరణం ఏర్పడుతోందని సమాచారం అందుకున్న సీఐ నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. బీఆర్‌ఎస్ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒకవర్గానికే సహకరిస్తే సహించేది లేదంటూ వాగ్వాదానికి దిగగా, సీఐ రెండు పార్టీల టెంట్లు తీసివేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ సిబ్బందిని కాపలా ఉంచారు.
సీతంపేట, పాండురంగాపురంలో..
పినపాక: మండలంలోని సీతంపేట పంచాయతీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు సర్ది చెప్పారు. అక్కడి నుంచి నాయకులను పంపించివేశారు. పాండురంగాపురం పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈసం భవతి విజయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఎన్ని ఓట్లు, ఏ వార్డులు అనే సమాచారం లేకుండా ఎలా విజయాన్ని ధ్రువీకరిస్తారని బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు సరైన సమాచారం లేకుండా ధ్రువీకరించారని ఆరోపించారు. పోలీసులు చేరుకొని వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు.
పోలింగ్ కేంద్రం సమీపంలో ఉద్రిక్తత


