సమాజమా మేలుకో..
ప్రతీ ఎన్నికల్లో ఆళ్లపల్లి మండలంలోని గ్రామాల్లో ఇలా ప్రచారం చేస్తున్నా. యువతలో మార్పు రావాలని, అభివృద్ధి చెందాలని ప్రచారం చేపట్టాను. సొంత ఖర్చులతోనే మండలంలోని ప్ర తీ గ్రామంలో తిరుగుతున్నా. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. –ఇందుకుమార్, ఆటోడ్రైవర్
గుండాల: సర్పంచ్‌గా నిలబడే వ్యక్తి వద్ద ఓటర్ల లిస్టు కాదని, గ్రామంలోని సమస్యల లిస్టు.. గ్రామాభివృద్ధికి కావాల్సిన ప్రణాళిక పత్రాలుండాలని, ఓటు నిజాయితీగా వేస్తే తలెత్తుకుని తిరిగేలా చేస్తుందని, చిల్లర డబ్బులకు ఆశపడి ఓటు వేస్తే బానిసలా తల దించుకుని బతికేలా చేస్తుందని ఓ యువకుడు ఓటర్లకు అవగాహన కోసం ఆటోలో ప్రచారం చేస్తున్నాడు. ఆళ్లపల్లి మండలం మర్కోడుకు చెందిన దివ్యాంగుడు ఇందుకుమార్ ప్రతీ సారి ఎన్నికల్లో ఓటర్లలో మార్పు రావాలని కోరుతూ.. తన సొంత ఖర్చులతో తన ఆటోకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని మైకుతో ప్రచారం సాగిస్తున్నాడు. ‘రేపటి భవిష్యత్ కోసం ఆలోచించాలని, మద్యం, డబ్బు పంచే వ్యక్తి నాయకుడు కాదని, అర్ధరాత్రి పిలిచినా నేనున్నానంటూ ధైర్యం చెప్పేవ్యక్తి నాయకుడని, డబ్బులు పెట్టేవారు గెలిచాక ఎలా రాబట్టాలో చూస్తారని, యువత చేతుల్లోనే అభివృద్ధి దాగి ఉందని, వారు ముందుకు వచ్చి పోటీ చేయాలని, గెలిస్తే చరిత్ర అని, ఓడితే అనుభవమని ప్రచారం చేస్తున్నాడు. అయితే, అతడి ప్రచారం ప్రజలను ఆలోచింపజేస్తోంది.
ఓ దివ్యాంగుడి ఆలోచనతో ఆటోలో ప్రచారం
సమాజమా మేలుకో..


