ఎదురెదురుగా ఎంపీ, మాజీ మంత్రి
పాల్వంచరూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పాల్వంచ మండలం దంతలబోరులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున గురువారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ గ్రామ స్కూల్ సెంటర్ వద్ద ఎదురుపడ్డారు. పరస్పరం అభివాదం చేసుకున్న వారు తిరిగి ప్రచారంలో నిమగ్నమయ్యారు. కాగా, దంతలబోరు, నాగారం, నాగారంకాలనీ, లక్ష్మీదేవిపల్లి తదితర గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థుల తరఫున ప్రచారంలో ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరగదని గుర్తించి కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, నాగా సీతారాములు, యర్రంశెట్టి ముత్తయ్య, కోనేరు చిన్ని, గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఇక వనమా వెంకటేశ్వరరావు మండలంలోని దంతలబోరు, తోగ్గూడెం తదితర గ్రామపంచాయతీల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


