ముక్కోటి పనులు వేగవంతం
● హంస వాహనానికి రంగులు ● ఆన్‌లైన్ టికెట్లకు భక్తుల నుంచి ఆదరణ
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఈనెల 20న ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 29న సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం, 30న తెల్ల వారుజామున ఉత్తర ద్వార దర్శనం ఉంటాయి. తెప్పోత్సవానికి ఉపయోగించే హంసవాహనానికి కార్మికులు రంగులు అద్దుతూ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చలువ పందిళ్ల నిర్మాణం తుది దశకు చేరుకోగా, పంచ రంగుల పనులు నడుస్తున్నాయి. ప్రధాన ఆలయం, ఉపాలయాలకు రంగులు వేస్తున్నారు. బ్రిడ్జి రోడ్డు వద్ద స్వాగత ద్వారం పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పలుమార్లు పర్యటించి పనులు వేగంగా, నాణ్యంగా చేయాలని ఆదేశించారు.
ఆన్‌లైన్‌లో టిక్కెట్లకు ఆదరణ
దేవస్థానం వెబ్‌సైట్‌లో ఉంచిన ఉత్తర ద్వార దర్శనం టికెట్లకు భక్తుల నుంచి ఆదరణ లభిస్తోంది. రూ.2 వేల విలువ గల వీఐపీ సెక్టార్ల టికెట్లు 650కు గాను 225 టికెట్లు, రూ.వెయ్యి విలువ గల టికెట్లు 200కు గాను 88 అమ్ముడుపోయాయి. రూ.500 విలువ గల టికెట్లు బీ సెక్టార్‌లో 49, సీ సెక్టార్‌లో 79, డీ సెక్టార్‌లో 22, రూ.250 విలువ గల టికెట్లు 21 ఇప్పటి వరకు భక్తులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. మరో 19 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకోవాలని, ఒరిజనల్ టికెట్లను దేవస్థానం కార్యాలయం నుంచి ధ్రువీకరణ ఐడీతో పొందాలని ఈఓ దామోదర్‌రావు కోరారు.
ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం
శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్సవ మూర్తులకు బుధవారం బేడా మండపంలో స్నపన తిరుమంజనుం వేడుకను వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.


