ఖర్చుల వివరాలు నమోదు చేయాలి
టేకులపల్లి: ఈనెల 3 నుంచి 17వ తేదీ వరకు చేసిన ఎన్నికల ఖర్చులను ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలని, వాటికి సంబంధిత రసీదు కూడా జత చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సూచించారు. ముత్యాలంపాడు రైతువేదికలో సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికలు, ఖర్చులపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన ఖర్చు రూ.5వేల లోపైతే నేరుగా నగదు ఇవ్వొచ్చని, అంతకు మించితే చెక్కు లేదా ఆర్‌జీఎఫ్‌జీ ద్వారా చెల్లించాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన 45 రోజుల్లో మొత్తం లెక్కలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. నిబంధనకు మించి అధికంగా ఖర్చు చేసినా, తప్పుడు లెక్కలు చూపినా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఒక పంచాయితీలో అనుమతి తీసుకున్న వాహనంపై మరో పంచాయతీలో తిరిగితే దాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా సహాయ ఎన్నికల అధికారి బైరు మల్లేశ్వరి మాట్లాడుతూ.. ఓటరు స్లిప్పులను పంచాయతీ సిబ్బంది మాత్రమే పంచుతారని, అభ్యర్థులు, రాజకీయ నాయకులు పంచేందుకు అనుమతి లేదని తెలిపారు. దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు రామకృష్ణ, జేఎల్ గణేష్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యయ పరిశీలకురాలు లావణ్య


