ప్రలోభాలకు లోను కావొద్దు
ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
భద్రాచలంఅర్బన్: అభ్యర్థులు, ఏజెంట్లు, రాజ కీయ కార్యకర్తల ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా పూర్తి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్‌ల్లో భద్రతపై పోలీసులకు బుధవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలని చెప్పారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలన్నారు. భద్రాచలం టౌన్ సీఐ నాగరాజు, టౌన్ ఎస్‌ఐలు తిరుపతి, సతీష్, రామకృష్ణ, ఏఎస్‌ఐ సూర్యం, తదితరులు పాల్గొన్నారు.
స్వగ్రామంలో
మంత్రి పొంగులేటి
కల్లూరురూరల్: స్వగ్రామమైన కల్లూరు మండలంలోని నారాయణపురానికి బుధవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డితో కలిసి తమ తండ్రి రాఘవరెడ్డి ఐదో ఆబ్దికంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రాఘవరెడ్డి స్మృతివనంలో కుటుంబసభ్యులతో కలిసి మంత్రి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు
ఖమ్మంలీగల్: చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, పోక్సో కేసుల విచారణకు ఏర్పాటైన ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులో మార్చి 2026 వరకు తాత్కాలిక పద్ధతిపై పనిచేసేలా సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్‌ను నియమించనున్నట్లు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. 65ఏళ్లు నిండని రిటైర్డ్ జ్యుడీషియల్ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. జనరల్ అభ్యర్థులైతే 18 – 34 లోపు వారు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు గ్రాడ్యుయేషన్ చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని, ఓఎస్ పోస్టుకు 7 నుంచి 10వ తరగతి వరకు అర్హతతో పాటు డ్రైవింగ్, ఎలకి్ట్రకల్, ఫ్లంబింగ్, వంటలో నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 20 సాయంత్రం 5గంటల లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా జడ్జి ఓ ప్రకటనలో సూచించారు.
బాలికల కరాటే
శిక్షణకు నిధులు
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి రూ.33.60లక్షలు
ఖమ్మం స్పోర్ట్స్: సమగ్ర శిక్షా ఆత్మ రక్షణ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ ఏడాది ఖమ్మం జిల్లాకు రూ.29.10లక్షలు కేటాయించగా, ఇదే పథకం కింద కేంద్రప్రభుత్వం మరో 25 పాఠశాలలకు రూ.4.50లక్షలు విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలోని 194 పాఠశాలలను ఎంపిక చేశారు. కేంద్రప్రభుత్వం మరో 25 పాఠశాలల్లో మూడు నెలల పాటు శిక్షణ కోసం నిధులు మంజూరు చేసింది. గతంలో ఈ పథకం నిర్వహించినప్పుడు కొన్ని పాఠశాలల్లో శిక్షణ ఇవ్వకున్నా తప్పుడు రికార్డులతో నిధులు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈసారి 72 కరాటే తరగతులు నిర్వహించడంతో పాటు హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థినుల వివరాలతో రిజిస్టర్ నిర్వహిస్తేనే శిక్షణ ముగిశాక కోచ్‌లకు గౌరవ వేతనం అందజేస్తారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలల్లోనూ శిక్షణకు గౌరవ వేతనం చెల్లిస్తారు.
మతిస్థిమితంలేని
వ్యక్తి చేరదీత
భూపాలపల్లి రూరల్: మతిస్థిమితంలేని వ్యక్తిని ఖమ్మం జిల్లాకు చెందిన అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు చేరదీశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి – కాళేశ్వరం సమీపాన అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి ఒంటరిగా తిరుగుతున్నాడు. అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు బుధవారం కాళేశ్వరం మీదుగా ఖమ్మం వెళ్తుండగా సదరు వ్యక్తిని గుర్తించారు. అనంతరం ఆయనకు భూపాలపల్లి పోలీసుల సమక్షాన అంబులెన్స్‌లో ఖమ్మం తీసుకెళ్లారు. వైద్యం చేయించి కోలుకున్నాక కుటుంబ వివరాలు తెలిస్తే చట్టపరంగా అప్పగిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.


