●జోరుగా తాయిలాల పంపిణీ
రఘునాథపాలెం: తొలిదశ గ్రామపంచాయతీల్లో గురువారం పోలింగ్ జరగనుండగా మంగళవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. ఇక బుధవారం రోజంతా అభ్యర్థులు తమ పరిధిలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బు, మద్యం, మాంసం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులు పోటాపోటీకి వీటిని ఇచ్చినట్లు సమాచారం. ప్రత్యర్థి ఎంత ఇచ్చారో ఆరా తీయడంతో పాటు అంతకు మించి ఇచ్చినట్లు తెలిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.వేయి మొదలు రూ.1,500, రూ.2వేల వరకు పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది కాక ప్రతీ ఇంటికి కేజీ, అరకేజీ చికెన్, చేపలు, పలువురికి మద్యం బాటిళ్ల పంపిణీ చేసినట్లు సమాచారం. త్రిముఖ పోటీ నెలకొన్న కొన్ని పంచాయతీల్లో ఒక్కో ఓటుకు అభ్యర్థులంతా ఇచ్చిన నగదు రూ.5 వేలు దాటిందని చెబుతున్నారు.
నేలకొండపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓటర్లు కొందరు తమ తీరుతో సర్పంచ్ అభ్యర్థులను ఖంగు తినిపిస్తున్నారు. కొందరు అభ్యర్థులు దావత్ ఏర్పాటు చేసి ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. అయితే, కొందరు ఓటర్లు ఇరుపార్టీల అభ్యర్థుల దావత్‌లకు హాజరవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇదేమిటని అభ్యర్థులు తీస్తే ‘దావత్ వరకే అటు.. ఓటు మాత్రం నీకే వేస్తా’ అని చెబుతున్నట్లు సమాచారం. ఇంకొందరు ఫలానా బ్రాండ్ మద్యమే కావాలని హుకుం జారీ చేస్తున్నారని, నిరాకరిస్తే ఓటు పడుతుందో, లేదోననే బాధతో అభ్యర్థులు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
నేలకొండపల్లి: కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు ఓటుకు ఇంత అని నగదు ఇస్తుండడమే కాక మద్యం కూడా పంపిణీ చేస్తున్నారని సమాచారం. తమకు తప్పక ఓటు వేస్తారనే నమ్మకం ఉన్న వారికి కొద్దిరోజులుగా 90 ఎం.ఎల్. లేదా క్వార్టర్ బాటిల్ ఇంటికే పంపిస్తున్నారని తెలిసింది. అలాగే, ప్రచారంలో తమ వెంట తిరుగుతున్న వారికి కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనంతో పాటు రాత్రి భోజనం, మద్యం సమకూరుస్తున్నట్లు సమాచారం.
ఖమ్మంవైరారోడ్: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను కేటాయించాలని బీఆర్‌ఎస్, సీపీఎం నాయకులు కోరారు. ఈమేరకు బుధవారం వారు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌కు వినతిపత్రం అందజేశారు. గత అనుభవాలు, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న గ్రామపంచాయతీల జాబితాను సీపీకి సమర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా భరోసా కల్పించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీపీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం, బీఆర్‌ఎస్ నాయకులు నున్నా నాగేశ్వరరావు, బెల్లం వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
ఓటర్లకు గ్రామాల్లో డబ్బు, మద్యం, మాంసం
●జోరుగా తాయిలాల పంపిణీ


