మక్కల కొనుగోళ్లలో దందా!
● రైతుల వద్ద తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు ● మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో వారి పేరుతోనే విక్రయాలు ● ఫలితంగా మద్దతు ధర పొందలేకపోతున్న రైతులు
ఇల్లెందు: మొక్కజొన్న కొనుగోళ్లలో వ్యాపారుల దోపిడీని అధికారులు నియంత్రించలేకపోతున్నా రు. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, రైతుల పేరుతోనే కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. ఫలితంగా రైతు క్వింటాల్‌కు సుమారు రూ. 500 నుంచి 700 వరకు నష్టపోతున్నాడు. మార్క్‌ఫెడ్ ద్వారా ఇల్లెందు, కొమరారం, గుండాల, ఆళ్లపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో గుండాల, ఇల్లెందు సొసైటీల్లో ఏర్పాటు కేంద్రాలకు మక్కలు రాకుండా వ్యాపారులు అడ్డుపడుతున్నారు. 20 రోజులుగా ఇల్లెందు కొనుగోలు కేంద్రంలో 258 మంది రైతుల నుంచి 1,800 మెట్రిక్ టన్నులు, కొమరారంలో 76 మంది రైతుల నుంచి 525 మెట్రిక్ టన్నులు మొక్కజొన్న కొనుగోలు చేశారు.
రైతుల వద్ద రూ.1,750కే..
వ్యాపారులు రైతుల వద్ద క్వింటాల్ రూ.1,450 నుంచి రూ.1,750కే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,400 చొప్పున కేంద్రాల్లో వ్యాపారులు విక్రయించుకుని లాభం పొందుతున్నారు. మార్కెట్, సొసైటీ అధికా రులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారని, అందుకే వ్యాపారుల దర్జాగా కొనుగోళ్లు చేపడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రాలకు వచ్చిన పంట, విక్రయించిన రైతులు వివరాలు సేకరించి విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. సుదిమళ్ల స్టేజీ వద్ద ఇద్దరు వ్యాపారులు సొసైటీని అడ్డుపెట్టుకుని తక్కువ ధరకు పంట కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మట్టి పెడ్డలు, దుమ్ము, ధూళి ఏరివేసే జల్లెడ మిషన్లను కూడా రైతుల ముసుగులో వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. కొనుగోళ్లపై సొసైటీ సీఈఓ హీరాలాల్‌ను వివరణ కోరగా.. రైతుల పేరుతో వచ్చే పంటనే కొనుగోలు చేస్తున్నామని, ఆరంభంలో ఎక్కువ పంట వచ్చిందని, ఇటీవల తగ్గిపోయిందని వివరించారు.


