‘క్లరికల్’ పరీక్ష ఊసేది..?
20 నెలల క్రితం జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు చేసుకున్న 6,700 మంది అంతర్గత అభ్యర్థులు
రాత పరీక్ష నిర్వహణలో జాప్యం చేస్తున్న సింగరేణి యాజమాన్యం
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ రాతపరీక్ష కోసం ఇంటర్నల్ అభ్యర్థులు 20 నెలలుగా ఎదురుచూస్తున్నారు. రిక్రూట్‌మెంట్‌సెల్ జీఎంలు ముగ్గురు మారినా పరీక్ష నిర్వహణ ఊసే లేదు. దీంతో అర్హులైన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణివ్యాప్తంగా 8 విభాగాల్లో సుమారు 360 పోస్టుల భర్తీకి యాజమాన్యం 2014, మార్చిలో ఇంటర్నల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు విభాగాల్లో రాత పరీక్ష నిర్వహించి, భర్తీ ప్రక్రియ పూర్తిచేసింది. క్లరికల్ విభాగంలో జూ నియర్ అసిస్టెంట్ పోస్టులు 177 ఉండగా, 6,700 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష నిర్వహించకుండా జాప్యం చేస్తుండటంతో దరఖాస్తు చేసుకున్న అంతర్గత ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. నోటిఫికేషన్ విడుదల చేశాక రిక్రూట్‌మెంట్ సెల్ జీఎంలు ముగ్గురు మారారు. డైరెక్టర్(పా)గా కూడా ముగ్గరు మారారు. అయినా పరీక్ష మాత్రం నిర్వహించలేదు.
కాలయాపన చేస్తున్న యాజమాన్యం
సంస్థలో 2018 నుంచి సుమారు 18 వేల మంది మెడికల్ అన్‌ఫిట్ అయ్యారు. వారి వారసులు(డిపెండెంట్లు) సుమారు 16వేల మంది ఉద్యోగాల్లో చేరారు. వారిలో 98శాతం డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి, కంప్యూటర్‌పై అవగాహన కలిగినవారు ఉన్నా రు. ఈ నేపథ్యంలో డిపెండెంట్లకు బదిలీ వర్కర్‌గా పోస్టింగ్ ఇచ్చినా యాజమాన్యం క్లరికల్ పనులు చేయిస్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై యాజమాన్యం శ్రద్ధ చూపడంలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి రాత పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు.


