చిన్నారి మృతిపై వీడని మిస్టరీ?
ఇల్లెందురూరల్:మండలంలోని మామిడిగూడెం గ్రామ పంచాయతీ సుంకరగూడెం గ్రామంలో ఐదేళ్ల చిన్నారి ఫ్రాన్సీ ఈ నెల 1న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక మృతిపై కుటుంబీకులు, గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తంచేయగా, ఇప్పటివరకు మిస్టరీవీడలేదు. మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మె ల్యే కోరం కనకయ్య సైతం సమగ్ర విచారణతో దోషులను శిక్షించాలని పోలీసు అధికారులకు సూచించారు. పది రోజులు గడిచినా విచారణ ముందుకు సాగకపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతి చెందిన రోజే తల్లిదండ్రులు కేజియా, ప్రభాకర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలు అనుమానాలు రావడంతో మరుసటి రోజు అనుమానితుల పేర్లతో మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో తాత్సారం చేస్తుండటంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు మనోవేదనకు గురవుతున్నారు. విచారణలో జాప్యంపై సీఐ సురేష్‌ను వివరణ కోరగా.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారిస్తామని, అనుమానితులను సైతం విచారించి దోషులుగా తేలితే కేసు నమోదు చేస్తామని తెలిపారు.
ఉరి వేసుకుని మహిళ బలవన్మరణం
సత్తుపల్లిటౌన్: ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సత్తుపల్లిలోని శ్రీవాణి కళాశాల రోడ్డులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎర్రగుంటకు చెందిన ఇమ్మనేని నరేంద్ర – అనూష అద్దెకు ఉంటున్నారు. సూర్యాపేట జిల్లా నకిరేకల్‌కు చెందిన అనూష(37)తో ఎర్రగుంట వాసి నరేంద్రకు 2012లో వివాహమైంది. అయితే, వీరి మధ్య తరచూ మనస్పర్థలు వస్తుండేవని సమాచారం. ఈక్రమంలోనే బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన అనూష ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి లోపల గడియవేసి ఉండడంతో ఎంత పిలిచినా ఫలితం లేక కిటికీలో నుంచి చూడగా అనూష ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలిసిందని నరేంద్ర కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. వీరికి ఏడో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రదీప్ తెలిపారు.


