గొంతుకోసుకున్న వ్యక్తికి శస్త్రచికిత్స
● ప్రాణం కాపాడిన జిల్లా వైద్యాధికారులు ● అభినందించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్
పాల్వంచ: కుటుంబ సమస్యల నేపథ్యంలో ఓ వ్యక్తి గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, ప్రభుత్వ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణం కాపాడారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలోని నూడుల్స్ పాయింట్‌లో వంట మాస్టర్‌గా పనిచేసే వెస్ట్ బెంగాల్‌కు చెందిన 35 ఏళ్ల బిశాల్ తమంగ్ మంగళవారం సాయంత్రం కత్తితో గొంతు కోసుకున్నాడు. చికిత్స నిమిత్తం కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరచలించగా, అక్కడి వైద్యులు వరంగల్ లోని ఎంజీఎంకు రెఫర్ చేశారు. సమాచారం అందడంతో బాధితుడిని పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి తరలించాలని జిల్లా ప్రధాన ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ జి.రవిబాబు సూచించారు. ఈఎన్‌టీ వైద్యుడైన రవిబాబు అక్కడకు చేరుకుని, జనరల్ సర్జన్ సోమరాజు దొర, మత్తు వైద్య నిపుణుడు రాంప్రసాద్, సిబ్బందితో కలిసి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. అనంతరం ఐసీయూ సేవల కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. కాగా శస్త్రచికిత్స చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.


