ఎన్నికల సిబ్బందికి అరకొరగా భోజనాలు
దుమ్ముగూడెం: అధికారులు భోజన ఏర్పాట్లలో విఫలం కావడంతో ఎన్నికల విధులకు వచ్చిన పోలింగ్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలానికి సుమారు 750 మందిని ఎన్నికల నిర్వహణకు కేటాయించారు వారికి కె.రేగుబల్లి ఆశ్రమ పాఠశాల ఆవరణలో భోజనాలు ఏర్పాటు చేశారు. అరకొరగా ఏర్పాటు చేయడంతో అందరికీ భోజనం అందలేదు. దీంతో సిబ్బంది ఖాళీ ప్లేట్లతో ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి ఎన్నికల సామగ్రి తీసుకుని, సరి చూసుకుని ఆకలితో కేంద్రానికి వచ్చే సరికి భోజనం లేకపోవడంతో ఆవేదన చెందా రు. అనంతరం అధికారులు బయట హోటళ్ల నుంచి భోజనాలు తెప్పించారు. అప్పటికే చాలా మంది సిబ్బంది లక్ష్మీనగరంలోని హోటళ్లకు వెళ్లి భోజనం, టిఫిన్ చేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తీసుకెళ్లేందుకు బస్సులు సరిపోకపోవడంతో సుమారు 50 మందిని ఆటోల ద్వారా తరలించారు.


