●ఎన్నికల నియమావళి పాటించాలి
జూలూరుపాడు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని జిల్లా ఎన్నికల నోడల్ అధికారి ఎ. శ్రీనివాస్ అన్నారు. బుధవారం జూలూరుపాడు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఎన్నికల నియమావళి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ రోజు ఖర్చు వివరాలను ఎంపీడీఓకు సమర్పించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఆర్‌ఓలకు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అభ్యర్థులు, రాజకీయ నాయకులు సహకరించాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. అధికారులు నాగరాజు, టి. శ్రీనివాస్, పూరేటి అజయ్, శ్రీలక్ష్మి, బాదావత్ రవి, టి.తులసిరామ్ పాల్గొన్నారు.


