ముగిసిన మొదటి దశ ఎన్నికల ప్రచారం
ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
చుంచుపల్లి: తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో ప్రధానమైన ప్రచార పర్వం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడగా మైకులు మూగబోయాయి. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసేవారు గత వారం రోజులుగా విస్తృత ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. ప్రచార గడువు ముగియడంతో ప్రలోభాల పర్వం మొదలైంది. దాదాపు సర్పంచ్ అభ్యర్థులంతా డబ్బు పంపకాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రధానంగా గ్రామాల్లో మూకుమ్మడిగా పడే ఓట్లపై అభ్యర్థులు కన్నేశారు. మరో వైపు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని స్వగ్రామాలకు తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మందు, విందు పార్టీలు జోరందుకోగా పోలీసులు కూడా అప్రమత్తమై తనిఖీలు తీవ్రతరం చేశారు. ఇక మొదటి విడత 159 గ్రామపంచాయతీల్లో 14 జీపీలు, 336 వార్డులు ఏకగ్రీవం కాగా, మూడు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 145 జీపీలతో పాటు 1,097 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 461 మంది, వార్డులకు 2,567 మంది బరిలో నిలిచారు.


