చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి
బూర్గంపాడు: పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలలోని పినపాకపట్టీనగర్ గ్రామానికి చెందిన ఆదెమ్మ (63) తన భర్త వెంకటేశ్వర్లుతో కలిసి పాల్వంచలోని తన మనవడి వద్ద ఉంటోంది. వీరికి ముగ్గరు కుమార్తెలు. సోమవారం భద్రాచలం వెళ్లి తిరిగి పాల్పంచ వెళ్తున్న ఆదెమ్మ పినపాకలో దిగి ఇంటికి చేరుకుంది. తర్వాత గ్రామంలోని వైకుంఠధామం సమీపంలో పురుగులమందు తాగింది. స్థానికులు ఆమెను పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లగా మంగళవారం మృతిచెందింది. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోందని, అందుకే పురుగులమందు తాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి మనవడు రమేశ్‌బాబు ఫిర్యాదు మేరకు అదనపు ఎస్‌ఐ నాగభిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
బూర్గంపాడు: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని సోంపల్లి గ్రామానికి పెంకె ప్రేమలత (48) సోమవారం రాత్రి తన నివాసంలో ఉరేసుకుంది. అర్ధరాత్రి గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మోరంపల్లిబంజర పీహెచ్‌సీ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుమారుడు అఖిల్ ఫిర్యాదు మేరకు అదనపు ఎస్‌ఐ నాగభిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పురుగుల మందు తాగి వ్యక్తి..
చింతకాని: మండలంలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన శీలం అంజి(37) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు.
నాటుసారా స్థావరాలపై దాడులు..
● 1,900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
దుమ్ముగూడెం: మండలంలోని సుజ్ఞానపురం గ్రామంలోని నాటుసారా స్థావారాలపై దుమ్ముగూడెం పోలీస్, ఎకై ్సజ్ శాఖ పోలీసులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో దాచిన 1,900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి 16 డ్రమ్ములను తగలబెట్టారు. నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఎకై ్సజ్ సీఐ రహీమున్నీసా, ఎస్‌ఐ సీతారామరాజు, స్థానిక ఎస్‌ఐ రాజశేఖర్, డీటీఎఫ్ ఎస్‌ఐ గౌతమ్, సిబ్బంది పాల్గొన్నారు.


