ఎన్డీ అభ్యర్థులను గెలిపించండి
ఇల్లెందు: దోపిడీ పాలక వర్గ పార్టీల అభ్యర్థులను ఓడించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పీడిత ప్రజల రాజ్య స్థాపనకు పోరాడే ఎన్డీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు పిలుపునిచ్చారు. మంగళవారం ఇల్లెందులోని ఎన్డీ కార్యాలయంలో పలు గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బూర్జువా పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమైందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌కోడ్‌లను అమలులోకి తెచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీ అడ్డదారులు తొక్కి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 1978 నుంచి ఈ ప్రాంతంలో ఎంఎల్ పార్టీల అభ్యర్థులే విజయం సాధించారని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ఇల్లెందు మండలంలో 11 గ్రామ పంచాయతీల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్డీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు జె.సీతారామయ్య, ఎండీ రాసుద్ధీన్, మండల కార్యదర్శి పొడుగు నర్సింహారావు, మోతీలాల్, సంతు, సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర నేతలు సాధినేని, మధు


