రామనామంతో మార్మోగిన భద్రగిరి
భద్రాచలం : భద్రగిరి మాఢ వీదులు జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగాయి. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులు చేపట్టిన శ్రీరామ పునర్వసు దీక్షను సోమవారం విరమించారు. ఆలయ ఈఓ కె.దామోదర్‌రావు దంపతులు శ్రీరామ పాదుకలను శిరస్సుపై ధరించగా.. మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శ్రీరామదాసు విగ్రహానికి పూలమాలలు అలంకరించారు. అనంతరం బేడా మండపంలో శ్రీరామ దీక్షా విరమణ పూజలు, సంక్షిప్త రామాయణ హవనం జరిపారు. ఆ తర్వాత సేవాకాలం, ప్రవచనం, తీర్ధ గోష్టి గావించారు. సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామికి పంచామృతాలతో స్నపన తిరుమంజనం చేశారు.
ముత్తంగి అలంకరణలో దర్శనం..
శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వైభవంగా పునర్వసు దీక్ష విరమణ


