ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
● పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు సెలవు పెట్టొద్దు ● అధికారులకు కలెక్టర్ ఆదేశం
చండ్రుగొండ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్టేజ్ – 2 ఆర్‌ఓలకు సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవు పెట్టొద్దని ఆదేశించారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు. తొలుత మండలంలోని మద్దుకూరులో రైతు తలారి రవి చేపట్టిన మేకలు, కోళ్ల పెంపకాన్ని పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, పశువైద్యాధికారి సంతోష్ పాల్గొన్నారు.
ఐటీసీ ప్లాంట్‌లో పరిశీలన..
బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీ యూనిట్‌ను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా యూనిట్ హెడ్ శైలేందర్ కుమార్ సింగ్, అధికారులు రాంబాబు, పి.శ్యామ్‌కిరణ్, చెంగల్ రావు తదితరులు ప్లాంట్ కార్యకలాపాల గురించి కలెక్టర్‌కు వివరించారు. ప్లాంట్‌లో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు, ఉత్పత్తిలో పాటిస్తున్న నాణ్యత తదితర అంశాలపై ఈ సందర్భంగా కలెక్టర్ వారితో చర్చించారు. పేపర్ బోర్డు తయారీలో ఉపయోగిస్తున్న ఆధునిక యంత్రాలు, ఆటోమేషన్ టెక్నాలజీ, పర్యావరణ హిత తయారీ విధానాలను పరిశీలించిన కలెక్టర్ వారికి తగు సూచనలు చేశారు.


