తాటి.. పెద్దకాపు చెబితే ఓట్లు
అశ్వారావుపేట: ఉమ్మడి రాష్ట్రంలోని పూర్వ ఖమ్మం జిల్లా, ప్రస్తుతం ఏపీలోని ఏలూరు జిల్లాలో ఉన్న వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము 1981లో గ్రామపంచాయతీగా ఏర్పడింది. ఆ గ్రామ తొలి సర్పంచ్‌గా సీపీఐ నుంచి ఎన్నికై న తాటి వెంకటేశ్వర్లు.. ఆ తర్వాత టీడీపీలో చేరి బూర్గంపాడు, అశ్వారావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాలు.. 1981లో తాట్కూరుగొమ్ము గ్రామపంచాయతీ ఏర్పడగా సీపీఐ నుంచి సర్పంచ్‌గా పోటీ చేశా. అప్పట్లో పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాలకు సైకిల్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉండడంతో కాలినడకే ఎంచుకునేవాళ్లం. ఒక గ్రామానికి వెళ్లగానే గ్రామ పెదకాపు(గ్రామపెద్ద) గ్రామస్తులందరినీ పిలిపిస్తే ఎవరి మంచం వాళ్లు తెచ్చుకుని కూర్చునేవాళ్లు. అంతా కలిసి ఫలానా వ్యక్తికి ఓటు వేయాలని పెదకాపు తీర్మానిస్తే అంతా సరేననే వారు. అప్పట్లో కరపత్రాల కోసం ఓ మనిషి రాజమండ్రి వెళ్లి రాత్రి అక్కడే నిద్రించి మరుసటి రోజు వచ్చేవారు. ఎర్రబట్ట కొని జెండాలు కుట్టించుకుని ప్రచారానికి వెళ్లేవాళ్లం. ప్రచారంలో పాల్గొనే వారు ఇంట్లోనే అన్నం తిని వచ్చేవాళ్లు. అందుకే ఖర్చు పెద్దగా కాలేదు. పంచాయతీ పరిధిలోని పొగాకు బ్యారన్ల నుంచి రూ.2వేల పన్ను మాత్రమే ఆదాయం ఉండగా, నా గౌరవ వేతనం రూ.200, గుమస్తా జీతం పోను మిగిలిన డబ్బుతో పనులు చేపట్టేవాళ్లం. నేను సర్పంచ్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పువ్వాడ నాగేశ్వరరావుకు ఓటు వేశాం. బూర్గంపాడు సమితి ఎన్నికల్లో కూడా ఓటు వేశా.


