కలెక్టరేట్‌లో దివ్యాంగుల దినోత్సవం
సూపర్‌బజార్(కొత్తగూడెం): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనీనా, మెప్మా పీడీ రాజేష్ తదితరులు దివ్యాంగ సంఘాల అధ్యక్షులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులందరూ యూడీఐడీ కార్డులు పొందాలని సూచించారు. డ్వాక్రా సంఘాలుగా ఏర్పడి పొదుపు చేసి రుణాలు పొందవచ్చని తెలిపారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి ప్రత్యేక అవసరం కలిగిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా మాట్లాడుతూ దివ్యాంగులను వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి అందిస్తుందని తెలిపారు. అనంతరం వికాసం ప్రత్యేక పాఠశాల బధిర విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. దివ్యాంగులకు సేవలందిస్తున్న 120 మందిని మెమెంటో, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సిబ్బంది, ఐఈడీ కోఆర్డినేటర్ సైదులు, బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్, బధిరుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి, తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు సతీష్, మదర్ థెరిసా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, వీహెచ్‌పీఎస్ సంఘం అధ్యక్షుడు సుధాకర్, అక్షయ దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు షమీం, ఎన్‌పీఆర్‌డీ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్గుదాస్, బి.లక్ష్మణ్, ఎండి ముజాహిద్ పాల్గొన్నారు.


