మద్యం రవాణాను అరికట్టాలి
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి)/చండ్రుగొండ: ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, విలువైన వస్తువుల అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సూచించారు. అన్నపురెడ్డిపల్లి మండల పరిఽధిలోని పెంట్లం గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు చురుగ్గా పని చేయాలని సూచించారు. ప్రతీ తనిఖీ విధిగా రికార్డులో నమోదు చేయాలని అన్నారు. అనంతరం చండ్రుగొండ రైతువేదికలో సర్పంచ్, వార్డు అభ్యర్థులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని సూచించారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాజకీయపార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ఈ సదస్సులో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్‌ఐ శివరామకృష్ణ పాల్గొన్నారు.


