అమాత్యులారా మీరైనా..
మరమ్మతులకు నోచుకోని బ్రిడ్జిలు భక్తులు, ప్రయాణికుల కష్టాలు గాలికే.. కథనాలు వచ్చినా స్పందించని అధికారులు
కథనాలు కంచికి..?
భద్రాచలం: భద్రాచలం వారధులు భక్తులకు ఇంకా గుంతలతోనే స్వాగతం పలుకుతున్నాయి. పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన మట్టి, రాత్రివేళల్లో చిమ్మచీకటి, ఫ్లోరింగ్ సమానంగా లేకపోవడంతో ఎగుడుదిగులు వంటి సవాలక్ష సమస్యలతో బ్రిడ్జిలు రోదిస్తున్నాయి. మెయింటినెన్స్ చేయాల్సి ఉన్న జాతీయ రహదారుల శాఖ అధికారులు నిద్రమత్తులో జోగుతుండగా.. కనీసం ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిదులు సైతం అలసత్వం వహిస్తున్నారు. దీనిపై కథనాలు ప్రచురించినా నిమ్మకు నీరెత్తితున్నట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే ముక్కోటి నాటికై నా బ్రిడ్జిలకు మరమ్మతులు నిర్వహించాలని భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.
నిర్లక్ష్యానికి ప్రతీక..
ప్రస్తుతం భద్రాచలం వద్ద ఉన్న గోదావరిపై రెండు బ్రిడ్జిలు భక్తులకు వారధిగా పని చేస్తున్నాయి. ఇందులో మొదటి బ్రిడ్జి నలభై ఏళ్ల క్రితం నిర్మించగా.. రెండోది గతేడాది శ్రీరామనవమి నుంచి రాకపోకలను సాగిస్తున్నారు. అయితే బ్రిడ్జిల నిర్వహణ సక్రమంగా లేక రెండు బ్రిడ్జిలు భక్తులకు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి.
● మొదటి బ్రిడ్జిపై ఎంతో కాలంగా పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో పాటు అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా బ్రిడ్జిల నిర్వహణ నిత్యం చేపట్టకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగాయి. మట్టిని తొలగించక మట్టిదిబ్బెలా దర్శనమిస్తున్నాయి.
● ఇక రెండో బ్రిడ్జిని హడావుడిగా ప్రారంభించటం వలన రెయిలింగ్‌ను ఏర్పాటు చేయలేదు. బ్రిడ్జిపై ఫ్లోరింగ్ సమాంతరంగా లేకపోవడంతో ప్రయాణం కుదుపులతోనే సాగుతుంది. దీనిపై ప్రధానంగా నేటి వరకు లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో చిమ్మచీకట్లో రాకపోకలు సాగుతున్నాయి. ఇలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రెండు బ్రిడ్జిల నిర్వహణను చేపట్టాల్సిన జాతీయ రహదారుల శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. ప్రాణనష్టం జరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటోనని మండిపడుతున్నారు.
మోక్షమెన్నడో..?
భద్రాచలంలో ఈ నెల 20 నుంచి జనవరి 12 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగున్నాయి. 29న సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం, 30న తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కనీసం ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికై నా బ్రిడ్జిలపై ఉన్న సమస్యలను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. ముక్కోటికి జరిగే సన్నాహక సమావేశాల్లో దీనిని ప్రధాన అజెండాగా చేర్చి గుంతలను పూడ్చాలని భక్తులు కోరుతున్నారు. ఈ వైఫల్యం నియోజకవర్గ ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరుకు నిదర్శనంగా స్థానికులు భావిస్తున్నారు.
ముక్కోటి నాటికై నా మోక్షం కలిగినా..?
స్థానికులు, ప్రయాణికులు, భక్తులు ఈ బ్రిడ్జిలపై పడుతున్న కష్టాలపై గత నెల 27వ తేదీన ‘వారధికి మరమ్మతులేవి’అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్థానికంగా చర్చకు దారి తీసింది. దిశగా మార్గనిర్దేశం చేయాల్సిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు జిల్లా మంత్రులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముక్కోటి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యే నాటికి బ్రిడ్జి గుంతలకు మరమ్మతులు, లైటింగ్, పారిశుద్ధ్య పనులు, ఇతర సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అమాత్యులారా మీరైనా..


