‘ఐదేళ్ల’ పామాయిల్ మొక్కలు నరికివేత
● పూత, కాత రాకపోవడంతో తొలగించిన బాధిత రైతు ● పరిశీలించిన ఆయిల్‌పామ్ గ్రోయర్స్ సొసైటీ నాయకులు
అశ్వారావుపేటరూరల్: మండలంలోని వినాయకపురం గ్రామానికి చెందిన రైతు రామదేను దుర్గాప్రసాద్ తన ఐదున్నర ఎకరాల్లో సాగు చేస్తున్న పామాయిల్ తోట ఐదేళ్లు దాటినా కనీసం పూత, కాత రాకపోవడంతో మొక్కలను తొలగించాడు. విషయం తెలుసుకున్న ఆయిల్‌పామ్ గ్రోయర్స్ సొసైటీ బాధ్యులు తుంబూరు మహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, చక్రధర్‌రెడ్డి, చెలికాని వెంకట్ బృందం ఆదివారం పామాయిల్ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ.. గతంలో సాగు చేసిన పామాయిల్ తోటలో ఎకరానికి 10 టన్నుల గెలల దిగుబడి రాగా, ఆ తోటను పరిశీలించిన నాటి ఆయిల్‌ఫెడ్ చైర్మన్, అధికారుల ప్రోత్సాహంతో మరో ఐదున్నర ఎకరాల్లో ఉన్న మామిడి తోటను తొలగించి 2019–2020లో ఆయిల్‌ఫెడ్ నర్సరీ నుంచి తెచ్చిన పామాయిల్ మొక్కలను సాగు చేశానన్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఒక్క టన్ను గెల కాదు కదా.. కనీసం పూత కూడా రాకపోవడంతో కాత, పూత లేని మొక్కలను పూర్తిగా నరికించినట్లు చెప్పాడు. కాగా, తోటను పరిశీలించేందుకు వచ్చిన రైతు సంఘం నాయకులు వచ్చినట్లు తెలుసుకొని తమ తోటల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, వాటిని పరిశీలించాలని వినతి చేశారు. అనంతరం సంఘం బాధ్యులు మాట్లాడుతూ.. ఆయిల్‌ఫెడ్ నిర్లక్ష్యం, నాసిరకం మొక్కల కారణంగా బాధిత రైతుకు రూ.లక్షలాది రూపాయాలు నష్టపోయాడని, బాధిత రైతుతో పాటు ఇదే ప్రాంతంలో మరో 500 ఎకరాల్లో రైతులు తోటలు వేశారని, వారి భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోందనని వేచి చూడాలని చెప్పారు.


